“అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు–మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి–మోహోద్రేకముతోకూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను– ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవ డైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధదూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడలవాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతట–ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మచెప్పుచున్నాడు ”
క్రొత్త విభాగం ఆరవ వచనముతో ప్రారంభమవుతుంది – తీర్పును గూర్చి దూతల ప్రకటనలు (వచ. 6-20).
14: 6
అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.
యోహాను తన క్రొత్త దర్శనములో ఒక దూత కలిగిన వర్తమానమును “శాశ్వతమైన సువార్త” అని వివరించాడు. “భూమిపై నివసించే” ప్రతి ఒక్కరికీ అతను ఈ సందేశాన్ని ప్రకటించవలసి ఉంది. ఇది తీర్పు యొక్క సువార్త, రక్షణకు కాదు (v.7). ప్రపంచంలో దేవుని ఉద్దేశ్యాలు చివరకు నెరవేరడం శుభవార్త. ప్రపంచ నియంతకు వ్యతిరేకంగా వాయిదాలో ఉన్న తీర్పును దేవుడు ఇప్పుడు చేపట్టుతాడు.
14: 7
అతడు–మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి,
“దేవునికి భయపడుడి” అనే పదం ప్రజలు దేవుడు ఏమైయున్నాడో అందునుబట్టి ఆయనను గౌరవించాలని సూచిస్తుంది . అతని వ్యక్తిత్వం యొక్క గొప్పతనం గురించి చాలా మందికి తక్కువ భావన ఉంది. భయం విస్మయాన్ని కలిగి ఉంటుంది. దేవుని పనిని మనం గౌరవించబోతున్నట్లయితే మనం మొదట దేవుని పట్ల ఆశ్చర్యచకితులం కావాలి.
దేవుని మహిమపరచడానికి ఏకైక మార్గం కృపా సూత్రాన్ని అంగీకరించడం . కృప అంటే దేవుడు పని చేస్తాడు. దేవుడు పని చేస్తే, అప్పుడు ఆయన మహిమ పొందుతాడు. మనము పని చేస్తే, మనకు కీర్తి లభిస్తుంది. క్రీస్తులో క్రైస్తవ జీవన విధానాన్ని అమలు చేయడానికి మనకు అవసరమైన ప్రతి దానిని దేవుడు అందుబాటులో ఉంచాడు. మనము దానిని అంగీకరించి, విశ్వసిస్తే, మనము దేవుణ్ణి మహిమపరుస్తాము.
మానవజాతి దేవుని మహిమను స్వాధీనం చేసుకుంది; ఇప్పుడు దేవుడు తన మహిమను ఆ సమయంలో భూమిపై ఉన్న మానవజాతినుండి తిరిగి పొందుతాడు.
ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
సంభవించబోయే తీర్పు యొక్క ప్రకటన ఆరాధన ప్రాముఖ్యతను గురించి ప్రజలను హెచ్చరిస్తుంది . ఇది దుర్బరమైన పరిస్తితిని గూర్చిన ప్రకటన.
14: 8
వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి–మోహోద్రేకముతోకూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను
రెండవ దూత బబులోను పతనం గురించి ప్రకటించాడు, ఎందుకంటే అది దేశాలు దేవుని సందేశంలోని సత్యాన్ని కల్తీ చేసేవిధంగా చేసింది. ” బబులోను ” అనేది పునరుద్ధరించిన రోమన్ సామ్రాజ్యానికి ఒక అలంకారిక సూచన (1 పేతురు 5:13). 17 మరియు 18 అధ్యాయాలలో దీనిని మరింత వివరంగా చూస్తాము. బబులోను మత అంతర్జాతీయతను సూచిస్తుంది. దేవుడు ఈ వ్యవస్థను ఆదికాండంలో మొదటిసారిగా నాశనం చేశాడు, ఆయన ఒక భాషను అనేక భాషలుగా విభజించాడు. ఇది ఒక ప్రపంచ ప్రభుత్వ ప్రయత్నం. ఏదేమైనా, దేవుడు ఒక ప్రపంచ ప్రభుత్వ వ్యవస్థను అనేక ప్రభుత్వాలుగా విభజించాడు (అధ్యాయం 11). భవిష్యత్ ఐక్యరాజ్యసమితి యొక్క మత అంతర్జాతీయవాదం పడిపోతుంది.
” కూలిపోయెను ” అనే పదాల పునరావృతం ఉద్ఘాటన కోసం. ఇది దేవుని ఏర్పాటు క్రమంలో ఒక గొప్ప అంతిమ ఘటన. బబులోను పతనం ఖచ్చితం.
“మోహోద్రేకముతోకూడిన తన వ్యభిచార మద్యమును త్రాగించటం” దేవుని ఉగ్రతను స్వీకరించుటకు సూచన. దేశాలు దేవుని ఉగ్రతను స్వీకరిస్తాయి ఎందుకంటే వారు తమను తాము తప్పుడు ఆరాధనలో ఆకర్షితులవ్వడానికి అనుమతించారు (వ, 10). బబులోను యొక్క దుష్ట వ్యవస్థను స్వీకరించేవారు ఆ నిర్ణయానికి వస్తారు. వారు ఈ వ్యవస్థతో మిత్రులైతే, వారు ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తారు. ఈ వేశ్య [అంతర్జాతీయ మతం] ప్రపంచానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నందున ఇది చాలా మందికి కష్టమైన నిర్ణయం అవుతుంది. ఆమె “మద్యము” తాగేవారిని మత్తులనుగా చేస్తుంది.
14: 9
మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను– ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవ డైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల,
మూడవ దూత పునరుద్ధరించిన రోమన్ సామ్రాజ్యానికి అధిపతి అయిన ప్రపంచ నియంతను ఆరాధించినవారిని హెచ్చరించాడు. మృగం యొక్క గుర్తును వారి నుదిటిపై లేదా చేతిలో కలిగియుండడానికి వారి అంగీకారం లేదా తిరస్కారం అనేది వారు మృగాన్ని ఆరాధించేరా అనేదాన్ని తీర్మానిస్తుంది. ఇది వారి ప్రాణాంతక ఎంపిక అవుతుంది.
14: 10
ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధదూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.
“మృగం” ను అనుసరించే వారు “అగ్నిగంధకముల” చేత బాధను అనుభవిస్తారు. దేవుడు తన ఉగ్రతను నీరుగార్చడు. అది నిండుగా క్రుమ్మరింపబడుతుంది.
14: 1 1
వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడలవాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
ఈ తీర్పు శాశ్వతమైనది (మత్తయి 25:46). ఎవరికీ విశ్రాంతి ఉండదు. ఈ హింస తాత్కాలికం కాదు. “యుగయుగములు” అనే పదం శాశ్వతత్వానికి చాలా బలమైన పదబంధం.
14: 1 2
దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
యోహాను పదేపదే ” ఓర్పును ” గుర్తుచేస్తున్నాడు. శ్రమలకాలపు విశ్వాసులు తీవ్రమైన హింసను ఓర్పుతో అనుభవించాలి (13:10). అలా చేయడానికి, వారు యేసుకు నమ్మకస్తులుగా ఉండాలి (2:13).
దేవుని ఆజ్ఞలను గైకొనువారు [దేవుని వాక్యము యొక్క వాగ్దానాలు అన్వయించుకొనేవారు], శ్రమలను భరించగలరు. “గైకొనుట” అనే పదానికి కాపలా అని అర్థం. ఇది సైనిక పదం. శత్రువుకు వ్యతిరేకంగా నిఘా ఉంచిన సైనికుడిలా దేవుని వాక్యంపట్ల మెళకువగా ఉండండి.
14:13
అంతట–ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని
“ప్రభువులో” మృతినొందినవారికి ఆశీర్వాదకరమైన ప్రత్యేక వాగ్దానం ఉంది. ఇక్కడ “ఆశీర్వాదకరమైనది” ఏమిటంటే శ్రమలకాలములో మరణించేవారికి ఒక ప్రత్యేక వాగ్దానం .
నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మచెప్పుచున్నాడు.
మరణం అనేది హింస నుండి ధన్యకరమైన ఉపశమనం .
నియమము:
జీవించడానికి సరైన మార్గం ఉంది మరియు చనిపోవడానికి సరైన మార్గం ఉంది.
అన్వయము:
మన సమస్యలను పరిష్కరించడానికి సరైన మార్గం విశ్వాసం ద్వారా వాటిని ప్రభువు చేతిలో పెట్టడం. మన సమస్యలను పరిష్కరించడానికి ఆయన మనకంటే చాలా సమర్థుడు. “దయచేసి నా శత్రువులను శిక్షించు. నాకు ఇక ఓపిక లేదు ” అని మనము అంటూ ఉంటాం. దేవుని సమయం ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది.
” నీ భారము యెహోవామీద మోపుము
ఆయనే నిన్ను ఆదుకొనును
నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” (కీర్తన 55:22)
“ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” (1 పేతురు 5: 7).
మనము కొన్నిసార్లు దోమ యొక్క దాడిని ఏదుర్కోగలముకాని అరుదుగా ఏనుగు యొక్క దాడిని ఏదుర్కోగలము. అందుకు కారణం మనం దేవుడిపైనే కాకుండా మనమీద నమ్మకం. మనము సమయాన్ని దేవునికి వదిలివేయాలి. ఈ విధంగా, మనము తీవ్రమైన ఒత్తిడిలో నెమ్మది పొందుతాము.
” ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి–పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది”(రోమ 12:19).
“యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము
పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు
అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు”(యెషయా 40:31).
చనిపోవడానికి సరైన మార్గం ప్రభువులో మరణించడం. చనిపోవడానికి తప్పుడు మార్గం ప్రభువు లేకుండా మరణించడం (యోహాను 8:24).